calender_icon.png 27 October, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్‌పై తొలి పేరు బీజేపీదే

27-10-2025 01:57:02 AM

  1. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీఆర్‌ఎస్

‘జూబ్లీహిల్స్’ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

మొత్తం 58 మందికి ఎన్నికల సంఘం గుర్తులు

స్వతంత్రులకు వచ్చిన గుర్తులతో ప్రధాన పార్టీలకు నష్టం!

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థుల క్రమం ఖరారైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం తో, తుది పోరులో నిలిచిన 58 మంది అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి సాయిరాం ఆదివారం గుర్తులను కేటాయించారు.

బ్యాలె ట్ పేపర్‌పై మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కమలం గుర్తు ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ చేయి గుర్తు, మూడో స్థానంలో బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తు, పేర్లు ఉండనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, పరిశీలన అనంతరం 81 మంది నామినేషన్లను అధికారులు సక్రమమైనవిగా గుర్తించారు.

వీరిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో, తుది బరిలో 58 మంది మిగిలారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. 

స్వతంత్రుల గుర్తులతో పార్టీల ఆందోళన

జూబ్లీహిల్స్ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించడంతో తమకు నష్టం జరుగుతందనే ఆందో ళనలో ఉన్నారు. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థికి రోడ్ రోలర్, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించింది.

ఈ గుర్తుల వల్ల గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగింది. ఈ క్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు గతంలోనే బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇటీవలే ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు.