08-09-2025 01:36:50 AM
వెంచర్ల కోసం భారీగా మట్టి తరలింపు
పట్టించుకోని అధికారులు
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 7 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండల పరిసరాల్లోని గుట్టలు, ప్రభుత్వ భూ ములను అడ్డగోలుగా తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ లీడర్లు ఎర్ర మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జాతీయ పక్షులు నెమళ్ళు, జీవరాసులు నివసించే కుమ్మరి గుట్ట, పిట్టలోని మిట్ట వంటి భారీ గుట్టలను సైతం రాత్రి పగలు తేడా లేకుండా భారీ హిటాచీలు, జెసిబిల సాయంతో తవ్వి టిప్పర్ల ద్వారా సమీప రైతుల పంట పొలాల మీదుగా పెద్దకొత్తపల్లి గ్రామ పరిసరాల్లోని ఓ పంట పొలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం స్టోరేజ్ చేస్తున్నారు.
గత నెల రోజులుగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖలతోపాటు పోలీసు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సామాన్య రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ లేదా మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా అధికార బలం, పరపతి ఉపయోగించి అధికార పార్టీ లీడర్లు ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆయా పంట పొలాల రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులు ఓట్లు వేస్తే గెలిచిన సింగిల్ విండో డైరెక్టర్లే రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తూ అడ్డగోలుగా ఎర్రమట్టిని తవ్వుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి వరకు చేర్చిన తాను కూడా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై తాసిల్దార్ శ్రీనివాసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకిరాలేదు.