08-09-2025 01:38:10 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కుల మతాలకు అతీతంగా అందరూ సుఖసంతోషాలతో కలిసి మెలిసి జీవిస్తూ ఐక్యమత్యంతో ఉండాలన్నదే మా ఆకాంక్ష అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గడియారం చౌరస్తా వద్ద మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ ఊరేగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం నగరంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక దగ్గర ఆయన భారీగా తరలివచ్చిన ఊరేగింపు కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరవెనుక ఎందరు ఎన్ని కుట్రలు చేసినా కలిసి మెలిసి సోదర భావంతో ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మాదిరిగా చాలా సంతోషంగా, ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకుమన్నారు.
ఎవరైనా కావాలని నగరంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినా వారిని కలిసి తరిమికొట్టుతామని ఆయన హెచ్చరించారు. అధికారులు మొన్న జరిగిన వినాయక చవితి ఉత్సవాలను కాని, నేడు జరుగుతున్న ఈ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేశారన్నారు . ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తున్నాను అని చెప్పారు.
అనంతరం ముస్లిం యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షర్బత్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఇంతియాజ్ ఇసాక్, అవేజ్, నాయకులు రఫీక్ పటేల్, ఫయాజ్, అజ్మత్ అలి, ఫైసల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.