02-12-2025 02:18:54 AM
ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 1(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పెద్దచెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెద్ద చెరువుపై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు.
ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు మినీ ట్యాంక్ బండ్ పనులను సకాలంలో పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాకింగ్ ట్రాక్ లైటింగ్, పార్క్, గార్డెన్, ఓపెన్ జిమ్, క్యాంటిన్, బోటింగ్ తదితర వసతులు కల్పించేందుకు రూ.3 కోట్ల ప్లాంటేషన్ పనుల కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.
పట్టణ ప్రజలకు ఈ వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యాటకంతో ట్యాంక్బండ్ కు కొత్తశోభ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎల్లారెడ్డి బస్టాండ్ను పరిశీలించారు. బస్టాండ్ లో ఏర్పాటుచేసిన క్యాంటీన్లో కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేశారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని హంగులతో బస్టాండ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఏర్పాటుచేసిన పార్సిల్ సర్వీస్ను సైతం ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వాళ్లకు సూచించారు. ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్, పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్, శ్రీకాంత్, నాయకులు విద్యాసాగర్ పాల్గొన్నారు.