13-10-2025 12:36:12 AM
-డివిజన్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విస్తృత ప్రచారం
-ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్న మాగంటి సునీత
-సమస్యలను పరిష్కరిస్తానని హామీ
-మద్దతు ప్రకటించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 12 (విజయక్రాంతి ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ప్రచారంలో వేగం పెంచారు. దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ ఆశయాలను కొనసాగిస్తానని ఆమె తన కుమారుడు వాత్సల్య నాథ్‌తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆదివారం ఒక్కరోజే పలు డివిజన్లలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులతో వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు.శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీల్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ డివిజన్ ఇన్‌చార్జి, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, మీ అందరి బలమే నా గెలుపునకు శ్రీకారం. డివిజన్‌లోని ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి, పరిష్కారానికి నేను ముందుంటాను,అని హామీ ఇచ్చారు.
అనంతరం, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవా రెడ్డి, కవితా రెడ్డిల ఆధ్వర్యంలో కమలాపురి కాలనీ ఫేస్-1 , 2 నాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమాలలో స్థానిక నాయకు లు, కాలనీ వాసులు ఆమెను శాలువాలతో సత్కరించి, ఆమె విజయానికి క్రియాశీలకం గా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. శ్రీనగర్ కాలనీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సునీత గోపినాథ్‌ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం మా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాం, అని స్పష్టం చేశారు. యూసఫ్‌గూడ డివిజన్‌లోని ఎల్.ఎన్. నగర్ కాలనీకి చెందిన బీఆర్ ఎస్ నాయకులు ఐలాపాక సతీష్ దాస్, పల్లె ప్రభు తదితరులు తమ బృందాలతో ఆమె ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ వరుస సమావేశాలతో జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.