14-05-2025 11:12:22 PM
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని గొల్లగూడెం ఇసుక ర్యాంపు కోసం నిర్వహించే పెసా గ్రామ సభను రాజుపేట గ్రామ పంచాయతీలో నిర్వహించాలని రాజుపేట గ్రామానికి చెందిన గిరిజన సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు మండలంలోని రాజుపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన సొసైటీకి సంబందించిన పలువురు సభ్యులు మాట్లాడుతూ... గొల్లగూడెం గ్రామం పూర్వం నుండి రాజుపేట గ్రామపంచాయతీలోనే కొనసాగిందన్నారు. గతంలో గొల్లగూడెం గ్రామంలో నివసించే వారు ప్రస్తుతం రాజుపేట గ్రామంలోని నివసిస్తున్నారన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా కూడా గొల్లగూడెం భూములకు సంబంధించిన రైతులకు రాజుపేటలోనే పంపిణీ చేశారన్నారు. గొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో ఇసుక ర్యాంపు నిర్వహణ కోసం గతంలో పరిశీలించిన అప్పటి సర్వేయర్, తహశీల్దార్ సైతం లొకేషన్ మ్యాపులో గొల్లగూడెం ఇసుక ర్యాంపు రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లు స్కెచ్ కూడా ఇచ్చారన్నారు. అయితే గొల్లగూడెం ఇసుక రీచ్ మీద కన్నేసిన చెందిన కొంతమంది తమ స్వలాభాల కోసం గొల్లగూడెం రెవెన్యూ గ్రామాన్ని రమణక్కపేట గ్రామపంచాయతీలో ఉన్నట్లు చూపించాలని స్థానిక అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు.
ఇసుక ర్యాంపు గుర్తించడం కోసం నిర్వహించే పెసా గ్రామసభ కాబట్టి గ్రామ పంచాయతీ పరిధి కాకుండా పెసా గ్రామ పంచాయతీలు, వాటి శివారు గ్రామాలు, వాటి పరిధిని పరిశీలించి గొల్లగూడెం పెసా గ్రామసభ రాజుపేటలో నిర్వహించాలని కోరారు. మంగపేట తహసిల్దార్, ఎంపీడీవో, ఏటునాగారం ఐటీడీఏ, ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం ఇప్పటికే వినతి పత్రాలు కూడా అందజేశామని వారు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గొల్లగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి సహృదయంతో మాకు న్యాయం చేయగలరని రాజుపేట గ్రామానికి చెందిన గిరిజన సొసైటీ సభ్యులు కోరుతున్నారు.