calender_icon.png 17 November, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం

17-11-2025 12:55:22 AM

-వడ్లు, మక్కలు కొనుగోలులో జాప్యం

-రైతుబంధు, బోనస్ ఎగవేత 

-మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని, రెండు పంటలకు రైతు బం, బోనస్ ఎగ్గొట్టారని, పంటల బీమా లేదని, సగం మందికే రుణమాఫీ చేశారని విమర్శించారు.

గత యాసంగిలో వడగండ్ల వానకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదని ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. ప్రభుత్వం 85 లక్ష ల టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఐదారు లక్ష టన్నుల మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. కొన్న వాటికి బిల్లులు కూడా చెల్లించలేదన్నారు.

దాదాపు రూ.12 వందల కోట్ల కనీసం మద్దతు ధర, రూ.200 కోట్ల బోనస్ పెండింగ్‌లో ఉన్నదన్నారు. 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. యాసంగి బోనస్ విడుదల చేయాలని, వడ్ల కొనుగోలును వేగవంతం డిమాండ్ చేశారు. అదేవిధంగా మక్క రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మక్కల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలు పండించారని చెప్పారు. వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని దుయ్యబట్టారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామని కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. కొన్ని జిల్లాలో 11, 12 క్వింటాళ్ల పత్తి పండిందని, వాళ్లు మిగిలిన పత్తిని ఏం చేయాలని ప్రశ్నించారు.

ఓ వైపు జిన్నింగ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సిసిఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదని ఆరోపించారు. పత్తి రైతులు అప్పులపాలై రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.