26-01-2026 02:49:56 AM
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యం త సీరియస్‌గా తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో డీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్యపరిస్థితిపై మంత్రి ఆదివారం ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, సౌమ్యకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకు న్నారు.
ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో గాయపడిన సౌమ్యకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి జూపల్లి భరోసా ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత, మనోధైర్యం పెంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంతో మంత్రి జూపల్లి ఫోన్‌లో సంభాషించారు. రాష్ర్టంలో గంజాయి అక్రమ రవాణా, మత్తుపదార్థాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎక్సైజ్, పోలీస్, సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఆదివారం ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు.