14-10-2025 12:14:03 AM
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
బోయినపల్లి : అక్టోబర్ 13 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సోమవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య లా ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.బోయినిపల్లి కేంద్రంలో, కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా అధికారం చేపట్టిన 22 నెలల్లో రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని, పింఛన్లు రెట్టింపు చేస్తామని, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకుం డా ప్రజలను పూర్తిగా వంచించారని ఆరోపించారు.
అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు వీరిని నిలదీయాలని, బీఆర్‌ఎస్ అందజేసిన బాకీ కార్డులను చూపించి వాటిని వాటిని చెల్లిస్తేనే ఓట్లు వేస్తామని చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండయ్య, మాజీ జెడ్పిటిసి కొనుకటి లచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు స్వామి, శంకర్, కొంకటి శేఖర్, నందయ్య తదితరులున్నారు.