28-05-2025 08:13:54 PM
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య..
మహబూబాబాద్ (విజయక్రాంతి): యాసంగిలో పండించిన సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటించడంతోనే రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య(CPM Central Committee Member S. Veeraiah) డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వీరయ్య మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పది రోజులకు ముందుగా ఋతుపవనాలు రావడంతో వర్షాలు కురుస్తున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు వ్యవసాయ ప్రణాళిక రూపొందించకపోవడం సిగ్గుచేటన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వానకాలం పంటల సాగులో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ... గత ఏడాది కురిసిన అతి భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న కుంటలు, చెరువులకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షం నీరు వృధాగా పోవడంతోపాటు, సాగు తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు గునిగంటి రాజన్న, సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, అలవాల వీరయ్య, కుంట ఉపేందర్, కందునూరి శ్రీనివాస్, మధుసూదన్, రాజన్న, లచ్చయ్య, రాజేందర్, కొండ ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.