calender_icon.png 18 May, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

17-05-2025 07:04:55 PM

సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్..

రైస్ మిల్లుల్లో దోపిడిని అరికట్టాలి..

జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో, నిలిచిన వాహనాలు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ, అకాల వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని కోతలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని రామన్నగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆగ్రహించిన అన్నదాతలతో కలిసి సూర్యాపేట-జనగాం 365(బీ) జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని 40శాతం కూడా కొనుగోలు చేయకుండా వివిధ కారణాలతో కేంద్రాల నిర్వహకులు, మండల అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

తరుగు పేరుతో బస్తాకు కేజీ ధాన్యాన్ని తీస్తున్నారని, రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టి వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్థానిక ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వజ్జె సైదయ్య,వజ్జె వినయ్,రైతులు జాటోతు సుధాకర్, జడ రాములు, సోమయ్య, సంపతి కిరణ్, అశోక్, వెంకటయ్య, పద్మ, వెంకన్న, మహేష్, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.