09-04-2025 01:56:25 AM
కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
జగిత్యాల, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు చేసి, పేదల మనసు దోసుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందని కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో మంగళవారం సన్న బియ్యం లబ్దిదారుడు కోల సంజీవ్ ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సహపంక్తిగా భోజనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీతో 80 శాతానికిపైగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని, దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని అభివర్ణించారు.
ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, ఒక్క తెలంగాణలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదన్నారు. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.