26-01-2026 12:32:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): యూసుఫ్‌గూడలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ర్యాంప్, కంపాక్టర్ యంత్రంలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆదివారం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించారు.
పని ప్రదేశంలో కార్మికులకు కనీస రక్షణ కల్పించక పోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనులు చేయించడం కార్మికుల జీవించే హక్కు, మానవ గౌరవం హరించడమేనని, ఇది స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కమిషన్ వ్యాఖ్యానించింది.
సురక్షిత పని పరిస్థితులు కల్పించడంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేసింది.ఈ ఘటన తీవ్రత దష్ట్యా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని గ్రేటర్ హైద రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23 లోపు నివేదికను కమిషన్ ముందు ఉంచాలని స్పష్టం చేసింది.