27-09-2025 12:20:30 AM
జయంతిలో టీఎన్జీవో నేతలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 129వ జయంతిని తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించి, ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. యూనియన్ అధ్యక్షుడు విక్రమ్ అధ్య క్షత వహించగా, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ముఖ్య అతిథిగా డా. ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) హాజరయ్యారు. ముజీబ్ మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ పాత్ర ను కొనియాడారు. ‘చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదు, నిజాం కాలపు దొరల వ్యవస్థపై, నిరంకుశత్వంపై తిరుగుబాటు చేసిన సామాన్యుల స్ఫూర్తి ప్రదాత,‘ అని ఆయన పేర్కొన్నారు. యూనియన్ అధ్యక్షుడు విక్ర మ్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఒక ఆదర్శంగా నిలవాలని ఉద్ఘాటించారు.
‘ఐలమ్మ పోరాటం నుండి మనం అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే సంకల్పాన్ని నేర్చుకోవాలి,‘ అని ఆయన అన్నారు. కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, యూనియన్ తరఫున ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేస్తామని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కె.ఆర్. రాజ్ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్, ఈసి మెంబెర్స్ వైదిక శాస్త్ర, ముకీమ్ ఖురేషి, ఈ.ఎన్.టి. హాస్పిటల్ అధ్యక్షుడు రాజు మరియు శ్రీ ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణరెడ్డి హైదరాబాద్ జిల్లా ఏపీఆర్‌ఓ శ్రీ మహ్మద్ వహీద్ పాల్గొన్నారు.