30-10-2025 12:48:23 AM
ఎస్.వి. నగర్ ఆలయంలో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కీసర మండలంలోని నాగారం ఎస్.వి. నగర్ రోడ్ నంబర్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం దేవతామూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నాగబంధ, మృత్యుంజయ, మేధా దక్షిణామూర్తి, అభయాంజనేయ, నవగ్రహ విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుద్రాభిషేకం, రుద్రహోమం, చండీ పారాయణం, చండీ హోమం, గర్తన్యాసం, యంత్రప్రతిష్ఠ, బింబప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, బలిహరణ, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం, కుంభాభిషేకం, పూర్ణాహుతి, శాంతి, కల్యాణం వంటి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సప్త సహస్రాధిక ప్రతిష్ఠాపనాచార్యులు అయిన జక్కి కృష్ణావధాని, నరహరి అవధాని, పిరాట్ల హేమదుర్గా రామకృష్ణ శర్మ, హరిపవన కుమార శర్మల పర్యవేక్షణలో 20 మంది ఋత్వికులు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఎంవిఎల్‌ఎన్ శాస్త్రి, ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, సహాయకులు జమ్మలమడక శ్రీరమణ శర్మ, ఆలయ అధ్యక్షులు దాచా శ్రీనివాస్ గుప్త, ఎర్రం ఈశ్వరయ్య గుప్త, లింగా నాగేంద్ర గుప్త, పీవీవీ సత్యనారాయణ నరసింహస్వామి గౌడ్, గంగిరెడ్డి నరేందర్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వరరావు, వి. నర్సింహస్వామి గౌడ్, ఆంజనేయ శాస్త్రి , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.