calender_icon.png 13 August, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమట సుక్కల ఎరుక !

11-08-2025 12:00:00 AM

సమకాలీన తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కవులు బలంగా, సూటిగా, గుండెను తాకేలా కవిత్వం రాస్తున్నారు. అలాంటి కవుల్లో తగుళ్ల గోపాల్ ఒకరు. కవిత్వమంటే కేవలం పదాలను పేర్చడం కాదు.. ప్రజల గుండె చప్పుళ్లను, పీడితుల వేదనను, మట్టి వాసనను తన అక్షరాల్లోకి ఒంపిన కవి ఆయన. తన కవితా సంపుటి ‘దండ కడియం’లో వెనుకబడినవర్గాల ఆవేదనను, జీవితాన్ని వాస్తవిక చిత్రణతో ఆవిష్కరించారు.

ఈ కవిత్వం సమాజంలోనే అసమానతలను ప్రశ్నిస్తుంది. మనలోని మనస్సాక్షిని తట్టిలేపుతుంది. ఆత్మగౌరవాన్ని ప్రబోధిస్తుంది. అంతటి జీవన చిత్రణ ఉన్నది కాబట్టే.. ఆ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. గోపాల్ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. గోపాల్ కవిత్వం గాలిలో మేడలు కట్టదు. అది నేల మీద నడుస్తుంది. పల్లె వీధుల్లో తిరుగుతుంది. చెమట వాసనను పీల్చుకుంటుంది.

కొన్ని బతుకులు ఎందుకు మారవు, కొందరి జీవితాలు ఎందుకు బతుకు బజార్‌లో అమ్ముడవుతాయన్న ఆవేదన ఆయన ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఆయన వాక్యాలు సూటిగా గుండెల్లోకి దూసుకుని వెళ్లి నాటుకుంటాయి. ‘నాన్న రెక్కల కష్టం/ బజార్లో బేరానికొచ్చింది”.. అనే రెండు వాక్యాల్లోనే తరతరాలుగా శ్రమ చేస్తున్నా తగిన ప్రతిఫలం దక్కని కర్షకుల వ్యథను, వారి శ్రమను చౌకగా చూసే మార్కెట్ వ్యవస్థను కళ్లకు కట్టారు. 

గోపాల్ కవిత్వంలో కనిపించే మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. ఆయనది నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను నిలదీసే ధైర్యం. మనుషులను విడదీసే కులం, మతం, ప్రాంతం వంటి అడ్డుగోడలను ఆయన తన కవిత్వంతో బద్దలు కొట్టాలని చూస్తారు. ఆయన కవిత్వం సున్నితంగా హితవు చెప్పదు. పదునైన ప్రశ్నలతో ఉలిక్కిపడేలా చేస్తుంది. ‘అడ్డుగోడలు’ కవితలో ఆయన సంధించిన ప్రశ్న తెలుగు కవిత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

‘మూడు రంగులు కలిసి జాతీయ పతాకమైందే తప్పా/ మన ముగ్గురమెపుడైనా కలిసి నడిచామా?’ అనే ప్రశ్న మన జాతీయతలోని డొల్లతనాన్ని, ఐక్యత పేరుతో ప్రదర్శించే తీరును నిలువునా ప్రశ్నిస్తుంది. జెండాలో రంగులు కలిసినంత సులభంగా మనుషుల మనసులు ఎందుకు కలవవని ఆయన సూటిగా అడుగుతారు. ఈ వాక్యాలు పాఠకుడిని తీవ్రమైన ఆత్మపరిశీలనకు గురిచేస్తాయి.  గోపాల్ తన కవిత్వంలో తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టారు.

ఆయన ఉపయోగించే పదాలు, నుడికారాలు తెలంగాణ పల్లె జీవనానికి, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆయన భాష కృత్రిమంగా ఉండదు. జీవం ఉట్టిపడే సహజత్వంతో ఉంటుంది. ఇది ఆయన కవిత్వాన్ని మరింత శక్తిమంతంగా, ప్రజలకు మరింత చేరువగా మార్చింది. గోపాల్ కేవలం సామాజిక కవే కాదు, ఆయనలో సున్నితమైన భావాలు పలికించగల మానవతావాది కూడా ఉన్నాడు. ప్రేమ, విరహం, ఆరాధన వంటి వ్యక్తిగత అనుభూతులను కూడా అంతే లోతుగా ఆవిష్కరించగలరు. సామాజిక అసమానతలపై అగ్నిజ్వాలలా మండే ఆయనే, ప్రేమ గురించి వర్ణిస్తూ ఇలా అంటారు.

‘ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఆమెను చూడకపోతే

ఆ రోజంతా సూర్యుడు ఉదయించనట్లు’.. ఒకవైపు సామాజిక సమస్యలపై కత్తిలా దూసుకెళ్తూనే, మరోవైపు ఇంత ఆర్ద్రంగా రాయగలగడం ఆయన కవిత్వంలోని వైవిధ్యానికి, పరిణతికి నిదర్శనం. తగుళ్ల గోపాల్ కవిత్వం ఈ తరం యువతకు ఒక స్ఫూర్తి. అన్యాయాన్ని అక్షరాలతో ఎలా ఎదుర్కోవా లో, ఆవేదనను ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ఆయన రచనలు నేర్పుతాయి. ఆయన కవిత్వం ఒక సామాజిక భాష్యం, ఒక చైతన్య గీతం. రాబోయే తరాలకు కూడా తగుళ్ల గోపాల్ కవిత్వం ఒక దిక్సూచిలా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

kondamaduguswapna@gmail.com