03-08-2025 12:00:00 AM
ఆ ఊరిలో ఏ గడప చూసినా మగ్గాల చప్పుళ్లతో కిటకిటలాడేది.. ఏ ఇంట చూసినా లక్ష్మీకళ ఉట్టిపడేది.. ప్రతీ ఇంట్లో బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం ఉండేది.. చేతినిండా పని.. సిరి సంపదల గలగలలు.. రైతన్నలకే అప్పులిచ్చే స్థాయి..ఇదంతా గతం.. ఇప్పుడు ఆ గ్రామంలో మగ్గాల చప్పుళ్లు మూగబోయాయి.. మిషన్లు వచ్చాక చేసేందుకు నేతన్నకు పని కరువైంది. అప్పులిచ్చే స్థాయి నుంచి అప్పు చేసి పూట గడుపుకునే స్థాయికి దిగజారింది.
ఆ ఊరిలో ఏ గడప చూసినా మగ్గాల చప్పుళ్లతో కిటకిటలాడేది.. ఏ ఇంట చూసినా లక్ష్మీకళ ఉట్టిపడేది.. ప్రతీ ఇంట్లో బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం ఉండేది.. చేతినిండా పని.. సిరి సంపదల గలగలలు.. రైతన్నలకే అప్పులు ఇచ్చేస్థాయి..ఇదంతా గతం.. ఇప్పుడు ఆ గ్రామంలో మగ్గాల చప్పుళ్లు మూగబోయాయి.. మిషన్లు వచ్చాక చేసేందుకు నేతన్నకు పని కరువైంది.. బతుకు భారమైంది. అప్పులు ఇచ్చే స్థాయి నుంచి అప్పు చేసి పూట గడుపుకునే స్థాయికి దిగజారింది. ఉన్న ఊరిలో పని లేక బతుకుదెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండ్లు పడావు పడ్డాయి..ఆ గ్రామం నేడు వెలవెలబోతోంది.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరే హనుమంతరావుపేట. అక్కడ 80 శాతం పద్మశాలీలే. భారీ భవంతులతో కూడిన ఇళ్ల నిర్మాణాలు..ఉమ్మడి కుటుంబాల జీవనం..ఆ ఊరంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇదంతా 37 ఏళ్ల కిందటి మాట. కాలం గిర్రున తిరిగింది. మిషన్ వస్త్రాల రాకతో పనిలేక మగ్గాలు మూలనపడ్డాయి. ఫలితంగా సిరిసంపదలతో తులతూగే నేతన్నలకు రోజు గడవడమే గగనమైంది. దీంతో జనం ఇళ్లను వదిలి పిల్లాపాపలతో మూటాముల్లె సర్దుకుని వలసలు వెళ్లారు.. వెళ్లినవారు వెళ్లినట్లే ఊరి వైపు మళ్లీ తిరిగి చూడడం మానేశారు. దీంతో ఇండ్లు పాడుబడ్డాయి. ఊరు కల కోల్పోయింది.
గ్రామంలో 404 నివాసాలు, 1,711 మంది జనాభా. 80 శాతం పద్మశాలీ చేనేత కార్మికులే ఉండేవారు. గ్రామంలో అనేకమంది నేత కార్మికుల ఇల్లు రెండు అంతస్తులతో ఉండి పటేల్ దొరలు, భూస్వాముల నివాసాలను తలదన్నేలా ఉండేవి. పెద్దపెద్ద వాకిళ్లలో చేనేత మగ్గాలపై నేతన్న పనులు ఉదయం మూడు గంటలకే ప్రారంభమయ్యేవి. రాత్రి పొద్దుపోయే వరకు చేతినిండా పనులతో బిజీబిజీగా గడిపేవారు. వీరు బతకడమే కాకుండా నలుగురికి పనులు కల్పించేవారు.
చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు సైతం చేనేత కార్మికుల వద్ద పెట్టుబడులకు డబ్బులు తీసుకెళ్లేవారు. ఏనాడు బయటి పనులు చేసి ఎరుగని నేత మహిళలు పరిస్థితులు మారిపోవడంతో తమ పిల్లలను తీసుకొని వెళ్లి భర్తలకు సహాయంగా కూలీ పనులు చేయడం ప్రారంభించారు. హైదరాబాద్, సూరత్, గుజరాత్, షోలాపూర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ ఇలా ఎక్కడపడితే అక్కడికి వలస వెళ్లారు. కొందరు ఆయా ప్రాంతాల్లో నేత పనులు చేస్తుండగా అత్యధికంగా భవన నిర్మాణాలు, కర్మాగారాలు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. హనుమంతరావుపేట నేడు జవజీవాలు కోల్పో యింది.
ఎక్కడ చూసినా మొండిగోడలే..
హనుమంతరావుపేట గ్రామంలో ఎక్కడ చూసినా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని గృహాలు నేలమట్టమయ్యాయి. ఊరిలో ఓటు హక్కు ఉన్న కొందరు ఎన్నికల సమయంలో వచ్చి పడావు పడ్డ తమ ఇళ్లను చూడలేక కన్నీళ్లతో తిరుగుముఖం పడుతున్నారు. కొందరు ఇళ్ళల్లోనే నేత పనులు చేసుకుంటూ బతుకు ఈడుస్తున్నారు. కొంతమంది మహిళలు బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. పొద్దస్తమానం కష్టపడి 500 బీడీలు చుడితే వీరికి వచ్చే సంపాదన కేవలం రూ.100 మాత్రమే.
ఇళ్ల వద్ద ఉన్న భర్తలు వ్యవసాయ పనులు, కూలి పనులు చేస్తున్నారు. ఊరిని వదలని ఒకరిద్దరు ఇలా అనేక కష్టాలను ఓర్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారి పిల్లలు సైతం ఆటో డ్రైవర్లుగా ఇతరత్రా పనుల్లో కూలీలుగా మారుతున్నారు. అనేక ఇళ్లల్లో పిల్లలు వలస వెళ్లగా వారి తల్లిదండ్రులు మాత్రం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలోనే కనిపిస్తారు. 30 సంవత్సరాల క్రితం ఊరిలో జనాభా 5 వేలు ఉండగా ప్రస్తుతం 1,710 మంది జనాభా ఉన్నారు. అన్ని గ్రామాల్లో జనాభా పెరుగుతుంటే ఈ గ్రామంలో మాత్రం జనాభా తగ్గుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. తెలంగాణ వచ్చాకనైనా తమ బతుకులు మారుతాయని ఆశపడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా బతుకు శూన్యం..
తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుంచి పదేళ్లుగాగా బీఆర్‌ఎస్, 20 నెలలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తమ గ్రామం బతుకుచిత్రం మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు పట్టించుకున్న పాపానపోలేదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ బతుకులు మారతాయనుకుంటే ఆశ నిరాశగానే మిగులుతోందన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు తమ బతుకులు బాగు చేసే ధ్యాస లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి నేతన్నలను ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఎ.చంద్రశేఖర్‌రావు, సంగారెడ్డి, విజయక్రాంతి
మా ఊరును ఆదుకోండి..
30 సంవత్సరాల క్రితం మా ఊరి జనాభా 5 వేలు ఉండేది. ఇప్పుడు 1,710 జనాభా అయ్యింది. ఏ గ్రామంలోనైనా జనాభా పెరుగుతోంది కానీ మా గ్రామంలో మాత్రం జనాభా తగ్గుతోంది. ఈ గ్రామానికి గ్రామకంఠం భూమితో కలిపితే 140 ఎకరాలు మాత్రమే ఉంది. మా ఊరి దగ్గర దాకా వేరే ఊర్ల శివారే ఉంది. మా ఊరికి భూమి చాలా తక్కువగా ఉండడంవల్ల చేసుకోవడానికి కూడా ఏ పనులు లేక ఒకప్పుడు వీరందరూ చేతి వృత్తుల మీదే ఆధారపడి భూములను పట్టించుకోక ఇప్పుడు ఆ చేతి వృత్తుల పనులు లేక భూములు లేక ఊరు ఊరంతా వలసవెళ్లిపోయారు.
దత్తు, తాజా మాజీ సర్పంచ్, హనుమంతరావుపేట