07-08-2025 12:25:15 AM
దేవాలయ భూములు అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదు
త్వరలోనే నూతన కమిటీని ఏర్పాటు చేస్తాం
సిద్దిపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు ఉడుత మల్లేశం, కొమ్మ శేఖర్, గంప వేణు గోపాల్ లు కోరారు. గతంలో 5 ఎకరాల భూమి ఆలయం పేరు మీద ఉంటే, ఇప్పుడు కొందరు 4 ఎకరాలు భూమిని వారి పేర్ల మీదకి మార్చుకొని అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు ఓకే కుటుంబానికి చెందిన వ్యకి ధర్మకర్తగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని, ఆలయ ధర్మకర్తను కొత్తవారిని నియమించాలని కోరారు. వందల కోట్ల విలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కొందరు వ్యక్తులు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
సిద్దిపేట ప్రజలు, చాలామంది దాతల సహాయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు శివ శ్రీనివాస్, జిల్లా శ్రీనివాస్, తమ్మిశెట్టి వీరేశం, జంగం రాజలింగం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.