09-07-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, జూలై ౮ : తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఈ నెల 12న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు భరత్, ప్రధాన కార్యదర్శి వినోద్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మహా ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇంకా పలు శాఖల్లో రెన్యువల్ చేయని ఉద్యోగులను వెంటనే రెన్యువల్ చేస్తూ జీవోలు జారీ చేయాలన్నారు. చాలీచాలని జీతాలతో జీవితాన్ని గడుపుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ జేఏసీ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ సూగూరు సుభాష్ ,సహాయ కార్యదర్శి రవి సాగర్ ,మహేందర్, శ్రీహరి, ధర్మ , శ్రవణ్ , రఘు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.