calender_icon.png 26 January, 2026 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న క్షేత్రానికి భక్తుల తాకిడి

26-01-2026 12:42:56 AM

కొమురవెల్లి, జనవరి 25 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా రెండో వారం సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. లష్కర్ వారముగా పిలవడే ఈ ఆదివారానికి సికింద్రాబాద్ తో పాటు, ఇతర జిల్లాలను సైతం భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివచ్చారు. కాకపోతే ప్రతి ఏటా సికింద్రాబాద్ నుంచి అధిక సంఖ్యలో వచ్చేవారు, కానీ ఈసారి సికింద్రాబాద్ నుంచి తక్కువ సంఖ్యలో తరలిరాగా, ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు రాక కనిపించింది. కిందటేడాది కంటే తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.

భక్తులందడి అంతగా అగుపించలేదు. శనివారం సాయంత్రమే మల్లన్న క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామివారి ధూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం రోజున స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నాల ఆచరించి, గర్భగుడిలోని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. మొక్కుల్లో భాగంగా పట్నాలు, బోనాలు చెల్లించి, స్వామివారిని భక్తితో వేడుకున్నారు.

అదేవిధంగా గుట్ట పైనున్న ఎల్లమ్మ తల్లికి డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో బోనాలు తల్లికి సమర్పించి, ‘మమ్ము కరుణించు మంటూ ‘ భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

మల్లన్నను దర్శించుకున్న పజ్జన్న,

 కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం స్వామివారికి పట్నంవేసి, బోనం చెల్లించుకున్నారు. అదేవిధంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.