calender_icon.png 11 January, 2026 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ పీఠం.. ఎవరి పాలిట వరం!

10-01-2026 12:57:05 AM

  1. చండూరులో రాజకీయం  రసవత్తరం 

సమతూకంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు 

పీఠం స్వాధీనంపై ఇరు పార్టీల కన్ను 

ఈసారి చైర్మన్ పదవిపై పద్మశాలీల గురి ?

రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

చండూరు, జనవరి 9 ( విజయక్రాంతి) : మున్సిపల్ తుది జాబితా ఓ వైపు సిద్ధమవుతుండగా మరోవైపు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీలు పోటికి సై అంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. పోటీ చేయాలన్న ఆశావాహులకు రిజర్వేషన్ ఏమొస్తుందో అనే ఉత్కంఠ నెలకొన్నది.

మరోపక్క రిజర్వేషన్ ను అనుసరించి ఏ వార్డ్ నుండి పోటీ చేయాలనీ మల్లగుల్లాలు పడుతున్నారు. చైర్మన్ పీఠంపై గురి పెట్టిన కొందరు ఆశావాహులు ఏ వార్డు నుండి పోటీ చేసినా గెలిచి పీఠంపై కూర్చునేందుకు వ్యూహాలను పన్నుతున్నారు.

ఈనెల 10వ తేదీన మున్సిపల్ వార్డుల ఓటర్ల తుది జాబితా, పోలింగ్ స్టేషన్లో వివరాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏ క్షణంలోనైనా రిజర్వేషన్ల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు, అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి లోపే రిజర్వేషన్ల ప్రక్రియ రావచ్చని ప్రచారంతో చండూరు మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.         

చండూరులో ఇది పరిస్థితి..

చండూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 11,370 మంది ఉన్నారు. ఇందులో 5,562 మంది పురుషులు, మహిళలు 5,717 మంది ఉన్నారు. గతంలో చండూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి.

గతంలో కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా మునిసిపాలిటీని చేజిక్కించుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు ఓటరు జాబితా అభ్యంతరాలపై సమావేశం ఏర్పాటు చేసి పలు పార్టీల నాయకుల సూచనలు స్వీకరించారు.

రిజర్వేషన్లు మారేనా..? 

2019 ఎన్నికల్లో చైర్మన్ పదవులపై రాష్ట్రాన్ని యూనిట్ గా పరిగణించి రిజర్వేషన్లు కేటాయించగా, వార్డు సభ్యులకు ఆయా మున్సిపాలిటీలను యూనిట్ గా తీసుకున్నారు. ఈసారి కూడా అదే రిజర్వేషన్లు కొనసాగుతాయా...? లేదా రొటేషన్ విధానం అమలు అన్న అంశంపై రాజకీయ, అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయమే రిజర్వేషన్లపై తుది ముద్ర వేయనుంది.

ఓటర్ల జాబితా ఖరారు ప్రక్రియ మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నారు. గ్రామపం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి అమలు చేసిన దృష్ట్యా, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో అమలవుతుందని చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.

చైర్మన్ గిరిపై కీలక నేతల కన్ను: 

చండూరు పట్టణ కేంద్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పలు పార్టీల కీలక నేతలు చైర్మన్ పదవి పైనే కన్ను పడింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల అనుచరులు చురుకుగా పనిచేస్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు కలిసి వస్తే కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ ప్యానెల్ ను గెలిపించేలా ఆర్థిక, సామాజిక, కుల బలమున్న అభ్యర్థులు ముందుగానే సిద్ధం చేసుకున్నారు.

మంత్రు లు, మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీలపై పట్టు సాధించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు ఖరారు అయిన వెంటనే చండూరు పట్టణ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని ఈసారి పద్మశాలీలు కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానికంగా ప్రచారం సాగుతుంది.

దీనిలో భాగంగానే ఓ పద్మశాలి పేరు ప్రబలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటినుండి చండూర్ లో రాజకీయ సందడి వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోటీ చేసే నాయకులు గల్లి గల్లి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.  ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు సభ ఉజ్జీలుగా ఉండడంతో ఎవరు గెలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే.