05-01-2026 12:14:59 AM
బీజేపీ యువ నాయకుడు వెంకట్ డిమాండ్
తాండూరు, జనవరి 4, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా తప్పుల తడకగా ఉందని వెంటనే సవరించి నూతన జాబితాను తయారు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ పురపాలక సంఘం అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 వ వార్డులో కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్, సేడం, చించోలి, కలబురిగి ప్రాంతాలకు చెందిన ఓ వర్గం వ్యక్తుల పేర్లను, ఫోటోలు లేకుండా అక్రమంగా నమోదు చేయడం సరికాదన్నారు. గతంలో 1650 ఓటర్లు ఉండగా తాజాగా అధికారులు విడుదల చేసిన జాబితాలో 2250 ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సూచనల మేరకే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తుల పేర్లు నమోదు చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఓటర్ జాబితాను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.