15-12-2025 12:00:00 AM
భగత్ సింగ్ నగర్ డివిజన్‌గా పేరు మార్చాలని
సీపీఐ నాయకుల డిమాండ్
ఎల్బీనగర్, డిసెంబర్ 14 : కొత్తగా ఏర్పాటు చేస్తున్న డాక్టర్స్ కాలనీ డివిజన్ పేరు మార్చాలని, అత్యధిక సంఖ్యలో పేదలు నివసిస్తున్న భగత్ సింగ్ నగర్, శంకర్ నగర్ కాలనీలను కలిపి భగత్ సింగ్ నగర్ డివిజన్ గా మార్చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ సరూర్ నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బాతరాజు నర్సింహ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ... సీపీఐ ఆధ్వర్యంలో ఆనాడు కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా నాయకత్వంలో భూ పోరాటం నిర్వహించి పేదలకు గుడిసెలు వేయించి, ఇళ్ల పట్టాలు ఇప్పించి ఏర్పాటు చేసిన కాలనీ భగత్ సింగ్ నగర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన 34వ డివిజన్ కు భగత్ సింగ్ నగర్ పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ నగర్ ఫేస్ - 1, 2, శంకర్ నగర్ కాలనీలో అధిక సంఖ్యలో పేదలు నివసిస్తున్నారని, కొత్తగా వచ్చిన డాక్టర్స్ కాలనీ పేరు పెట్టడం సరికాదన్నారు.
సరూర్ నగర్ డివిజన్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన డివిజన్ కు భగత్ సింగ్ నగర్ గా పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీర్ పేట్ గోపాల్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మారగొని ప్రవీణ్ కుమార్ గౌడ్, సీపీఐ రంగారెడ్డి జిల్లా సమితి సభ్యులు కమలమ్మ, ఎండీ మహబూబ్, సరూర్ నగర్ మండల కార్యవర్గ సభ్యులు ఎండీ జాహెద్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.