29-06-2025 07:31:11 PM
ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి రాజేందర్..
మందమర్రి (విజయక్రాంతి): నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(All India Coal Workers Federation) జాతీయ కార్యదర్శి పల్లి రాజేందర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి లు కోరారు. ఆదివారం మందమర్రి, రామకృష్ణాపూర్ యూనియన్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన నిర్ణయం మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బొగ్గు గని కార్మికులు పాల్గొనీ విజయవంతం చేయాలనీ వారు కోరారు. బిజెపి మోడి ప్రభుత్వం కోవిడ్ ను అడ్డుపెట్టుకొని కార్మికులు ప్రజలెవలు బయటకు రాని సమయంలో పార్లమెంటులో దొంగ చాటుగా కార్మికుల హక్కులను హరించే విధంగా చట్టబద్ధత లేని లేబర్ కోడులను తీసుకువచ్చి ఆమోదం చేసుకున్నారని వాటిని అమలులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.
లేబర్ కోడులు అమలు కాకముందే మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలలో పని గంటలను పెంచే విధంగా కేబినెట్లను ఆమోదం చేసుకున్నారని భవిష్యత్తులో లేబర్ కోడులు అమలు అయితే పనిగంటలను పెంచి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంఘాల సిద్ధాంతాలను పక్కనపెట్టి కార్మికుల కోసం చట్టబద్ధమైన హక్కులను కాపాడేందుకు జులై 9న సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగిందని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడంతో పాటు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్య క్షులు రామగిరి రామ స్వామి, వడ్లకొండ ఐలయ్య, నాయకులు జడల ప్రవీణ్, బుద్ధ సురేష్, అంగడి రాజ్ కుమార్, పసునూటి శ్రీకాంత్, ధనిశెట్టి సురేష్, నాగవెల్లి శ్రీధర్, పంగ మల్లేష్, తాజుద్దీన్, సయ్యద్ అమీన్ నామని సురేష్ లు పాల్గొన్నారు.