26-07-2024 05:00:18 AM
లెక్కల్లో వ్యయానికి, రాబడికి పొంతన కరువు.. అప్పులు తెస్తేనే బండి నడిచే పరిస్థితి అని తేటతెల్లం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం శాసనసభ ముందుంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగా కాకుండా వాస్తవిక లెక్కలు చెప్తామని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం.. తీరా బడ్జెట్ లెక్కల్లో మాత్రం అంతకుమించి అన్నట్టుగా వ్యవహరించింది. మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024 ఆర్థిక సంవత్సరానికి జంబో బడ్జెట్‌ను అసెంబ్లీలోఆవిష్కరించారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ప్రసంగం చేశారు. బడ్జెట్‌లో ఆర్థిక లోటు ఏకంగా రూ.49,255.41 ఉండటం గమనార్హం.
ప్రాథమిక లోటు రూ.31,525.63 కోట్లుగా చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నిజంగా అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పిన మూలధనం వ్యయం కూడా దాదాపు అంతే ఉన్నది. ఈ ఏడాది రూ.57 వేల కోట్లకు పైగా అప్పులు చేయాల్సి ఉంటుందని బడ్జెట్‌లోనే ప్రకటించారు. తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క తమది ఆశల బడ్జెట్ అని, అందరి సంక్షేమ బడ్జెట్ అని పేర్కొన్నారు.
గ్యారెంటీల అమలు బాటలో..
బడ్జెట్‌లో వ్యవసాయానికే సింహభాగం దక్కింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలను అమలు చేసే లక్ష్యంతో వ్యవసాయానికి మొత్తంగా రూ.72 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. విద్య, వైద్యం, సాగునీరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ మానసపుత్రికలాంటి పథకాలైన గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించారు. కాంగ్రెస్ గ్యారెంటీల్లో ఒకటైన ధాన్యానికి రూ.500 బోనస్ పథకానికి మాత్రం పైసా ఇవ్వలేదు. 8 నెలల్లో 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని ఆర్థికమంత్రి ప్రకటించారు. కానీ, నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై బడ్జెట్‌లో కచ్చితమైన హామీ ఇవ్వలేదు.
రీజినల్ రింగ్‌రోడ్డుతో కలిపి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో వివిధ విభాగాలకు దాదాపు రూ.11 వేల కోట్లు కేటాయించారు. లక్షన్నర కోట్లతో మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం.. అందుకోసం ఈ బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లో మల్టీమోడల్ సబర్బన్ రైల్ టాన్స్‌పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళా సంక్షేమానికి పాటుపడుతామని, స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి గత బడ్జెట్‌కంటే నిధులు పెంచినప్పటికీ, గత ప్రభుత్వ పథకాలు ఇకపై ఉండవని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. బడ్జెట్‌లో దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాల ఊసే లేదు. మొత్తంగా బడ్జెట్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల చుట్టే తిరిగినా, అప్పులు చేయకుండా పథకాల అమలు అసాధ్యమని బడ్జెట్ లెక్కలు స్పష్టంచేశాయి.