26-07-2024 04:52:31 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు అధికారంలో వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అమలు చేసేంత వరకు రాష్ట్రప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదని, గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు, రైతుభరోసా పథకాలకు కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసం చేసే విధంగా బడ్జెట్ రూపొందించి ప్రజలను వెన్నుపొడిచారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శుత్రు ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమయమివ్వాలని తాను ఆరు నెలల పాటు అసెంబ్లీ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందన్నారు. ఇండస్ట్రీయల్ పాలసీ ఈస్ట్ మన్ కలర్‌లో కథలు చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.
వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలకు సంబంధించి స్పష్టమైన కేటాయింపులు ఏమీ లేవని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రసంగం చిల్లర మల్లరగా రాజకీయ సభల్లో ప్రసంగంలా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు, విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుభరోసా అమలుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజాసమస్యలపై బీఆర్‌ఎస్ మాత్రమే పోరాడగలదన్నారు.
ప్రతిపక్షనేతగా తొలిసారి అసెంబ్లీకి..
ప్రతిపక్షనేత హోదాలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గురువారం ఉదయం అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహచార్యులు కూడా కేసీఆర్ చాంబర్‌కు వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవి చూసి, కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.