17-01-2026 12:08:18 AM
మర్రిగూడ, జనవరి 16 : మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, విచ్చలవిడిగా చేపడుతున్న మద్యం అమ్మకాలను నియంత్రించి మహిళలకు అండగా నిలిచేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే నిబంధనలు ఇవే..!
వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలి. ఆయా మండలాలకు చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని.. ఇతర మండలాలకు చెందిన వ్యక్తులు టెండర్లు వేయడానికి అనుమతి లేదని ముందే స్పష్టం చేశారు. వైన్ షాప్లు తప్పనిసరిగా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, వైన్స్ లకు అనుబంధంగా పర్మిట్ రూములు ఉండకూడదనే నిబంధన పెట్టారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే సహించేది లేదని, రూల్స్ ప్రకారం నడిపించకపోతే యజమానులు దుకాణాలు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.
బెల్ట్‌షాప్‌ల కట్టడికి చర్యలు..
తాగుడుకు బానిసలై ఆరోగ్యంగా, ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను వేయించి బెల్టు షాపులను కట్టడి చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సొంతంగా రూపొందించిన మద్యం పాలసీతో మద్యం దుకాణాదారుల ఆగడాలకు బ్రేకులు వేశారు. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో మద్యం దుకాణదారులు సాయంత్రం నాలుగు గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిబంధనలను తీసుకువచ్చారు. దుకాణాలకు నష్టవస్తుందని కావున కొంత వెసులుబాటు కల్పించాలని దుకాణాల నిర్వహకులు ఎమ్మెల్యేను కోరగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభించుకోవచ్చని అనుమతులు ఇచ్చారు.
ఎమ్మెల్యే రూల్స్ క్రాస్!..
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం దుకాణదారులు మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నడిపించాలన్న ఎమ్మెల్యే రూల్స్ ను ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు బేఖాతరు చేస్తూ ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తున్నారు. వైన్స్లతోపాటు సిట్టింగులను కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే నయా రూల్ గయా అయినట్లయింది.
మునుగోడుకే ఒక రూలా?
సంక్రాంతి పండుగ రోజు మండల కేంద్రంలో 11 గంటలకే వైన్స్ లు తెరుచుకున్నాయి. మందుబాబులు మద్యము కొనుగోలు చేసేందుకు రాగా వారినీ పోలీసులు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించగా పండగ రోజైనా మద్యం తీసుకొనివ్వరా అని అడిగితే ఇది ఎమ్మెల్యే రూల్ అని చెప్పారంటూ వారు వాపోయారు. మునుగోడుకు ఒక రూల్, రాష్ట్రంలో మరో రూల్స్ అని ప్రశ్నిస్తున్నారు. అలా ఐతే పూర్తిగా వైన్ షాప్ లను కూడా నియోజకవర్గం నుండి బహిష్కరించాలన్నారు.
బెల్టు షాపుల్లో క్వార్టర్ ర్ కి రూ.50 అదనం :
ఎమ్మెల్యే మద్యం పాలసీ కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారస్తులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా నిలిపివేయాలని ఆదేశిస్తే ఆ నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ పై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నట్లు మందుబాబులే చెబుతున్నారు. ఆరోగ్యం మాట దేవుడెరుగు... జేబులు మాత్రం గుల్లబారుతున్నాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎక్సైజ్ అధికారులు
మద్యం విక్రయాలలో ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తున్నామని కానీ మాకు ఎలాంటి కొత్త నిబంధనలు ఆదేశాలు రాలేదనీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతుం డడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకుంటాయనీ ఇది నిబంధన ప్రతిచోట ఉంటుందన్నారు.