calender_icon.png 21 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం నాటి చెరువుకు హైడ్రా ప్రాణం

21-12-2025 12:16:42 AM

  1. కబ్జా నుంచి విడిపించి.. సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు 
  2. జనవరిలో ప్రారంభోత్సవం
  3. పనులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): పాతబస్తీ నడిబొడ్డున చారిత్రక వైభవం మళ్లీ ఊపిరి పోసుకుంది. ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయి, కాలగర్భంలో కలిసిపోతుందనుకున్న నిజాం నాటి బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. మట్టి కుప్పలు, ఆక్రమణలను తొలగించి, ఆ ప్రాంతాన్ని పాతబస్తీకే మణిహారంగా తీర్చిదిద్దింది. ఈ సుందరమైన చెరువును జనవరిలో నగర ప్రజలకు అంకితం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

శనివారం హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి చెరువు అభివృద్ధి పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న నగరంలో ఈ చెరువును ఒక విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి. బయటి ఉష్ణోగ్రతలకు, ఇక్కడికి రాగానే ఉండే పచ్చని వాతావరణానికి తేడా తెలిసేలా పనులు ఉండాలి అని అధికారులను ఆదేశించారు.

చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, వృద్ధులు సేదతీరేలా నలువైపులా గజబోల నిర్మాణాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పా టు చేయాలని సూచించారు. ఔషధ గుణాలున్న వృక్ష జాతులతో పాటు, చెరువు చుట్టూ పచ్చిక బయళ్లతో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు సుమారు 10 కి.మీ మేర నేరుగా చెరువులోకి చేరేలా విశాలమైన ఇన్లెట్లు, ఔట్ లెట్లు నిర్మించారు.

దీనివల్ల ఆయా ప్రాం తాల్లో వరద ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు. 1770లో మూడవ నిజాం సికందర్ జాహ్ హయాంలో అప్పటి ప్రధాని నవాబ్ రుక్న్-ఉద్-దౌలా ఈ చెరువును నిర్మించారు. తాగునీటి అవసరాల కోసం అప్పట్లో 104 ఎకరాల్లో దీన్ని తవ్వించారు. కాలక్రమంలో ఆక్రమణలకు గురై హెఎండీఏ రికార్డుల్లో 17.05 ఎకరాలకు, చివరకు 4.12 ఎకరాలకు కుచించుకుపోయింది. గత ఆగస్టులో హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించి, హెఎండీఏ నిర్ధారించిన పూర్తి విస్తీర్ణాన్ని 17.05 ఎకరాలు రికవరీ చేసి అభివృద్ధి చేసింది.