calender_icon.png 27 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రెండు జానర్లు కలపడమే బార్బరిక్‌లోని కొత్తదనం

26-08-2025 12:40:18 AM

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్‌రెడ్డి అడిదల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయ భాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వివిధ పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.  

* నేను నా వ్యాపారాలతో బిజీగా ఉండేవాడిని. ఓసారి మోహన్ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. ముందు చిన్న బడ్జెట్ అనుకున్నాం. తర్వాత డైరెక్టర్ మారుతిని కలిసినప్పుడు, తీస్తే సినిమా బాగా తీయండి.. లేదంటే లేదన్నారాయన. దీంతో భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నా. మలయాళంలోలాగా చాలా సహజంగా తీశాం. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాల్నీ జోడించాం. 

* ప్రేక్షకులు ప్రస్తుతం కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లనే ఆదరిస్తున్నారు. మా ‘బార్బరిక్’ కథను మైథలాజికల్ జానర్‌ను యాడ్ చేసి చెప్పడమే కొత్తదనం. ప్రీమియర్లు చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. వరంగల్ స్పెషల్ ప్రీమియర్ ఉచితంగా ప్రదర్శించాం. ఆ షో చూసిన ఓ జంట మాత్రం ఇది ఫ్రీగా చూడాల్సిన సినిమా కాదంటూ డబ్బులిచ్చారు. ఇలాంటి స్పందనలు మాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందుకే అన్ని రకాల థియేటర్లలో టికెట్ ధర గరిష్ఠంగా రూ.150 పెట్టాలని నిర్ణయించుకున్నాం. 

* వరుసగా సినిమాలు చేయాలనే ఇండస్ట్రీకొచ్చాను. కంటెంట్ బాగుంది కాబట్టే ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను ఎంతో నమ్మకంతో నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోటా బోర్ కొట్టదు. ఇది నా ఛాలెంజ్. మా బ్యానర్‌లో రాబోయేది హారర్ కామెడీ. కథ నచ్చడంతో ఓకే చేశాను. మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అవి ఇంకా చాలా విభిన్నంగా ఉంటాయి.