24-12-2025 12:00:00 AM
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -- అర్జీదారులతో ముఖాముఖి భేటీ
నిజామాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన జక్రాన్పల్లి మండలం కేశ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పెండింగ్ లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహసిల్దార్, ఆర్.ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు.
దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు. భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూ హక్కులు కల్పించి సాంత్వన చేకూర్చాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు.
అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ, పరిష్కరించేందుకు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పని చేయాలన్నారు. అర్హులైన వారిని పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారికి భూములపై హక్కులు కల్పించాలన్నారు.
అనంతరం దరఖాస్తుదారులైన రైతులతో కూడా కలెక్టర్ ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ భూభారతి చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ తప్పనిసరిగా భూములపై హక్కులు కల్పిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ రవికుమార్, తహసిల్దార్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఉన్నారు.