2 April, 2026 | 2:49 AM

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

02-04-2026 12:56 AM

మంత్రి సీతక్క 

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 1(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరించిందని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అలాగే నూతనంగా నిర్మించిన శ్రీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందన్నారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వల్ల కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భావించిన ప్రజా ప్రభుత్వం ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా నిలబడే విధంగా మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఆర్డిఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.