calender_icon.png 23 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ హాస్టల్ అడ్డాగా మత్తు దందా

23-12-2025 01:14:28 AM

  1. రాయదుర్గంలో డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు
  2. ఇద్దరు పెడ్లర్లు, ముగ్గురు వినియోగదారుల అరెస్ట్
  3. రూ.1.50 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం

శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లోని ఓ పీజీ హాస్టల్ కేంద్రంగా మత్తు పదార్థాల సరఫరా సాగిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున రాయదుర్గం పోలీసులు, ఎస్‌ఓటీ రాజేంద్రనగర్ బృందం కలిసి దాడులు నిర్వహించగా ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు, ముగ్గురు వినియోగదారులు ఉన్నారు.

అరెస్టయిన వారిలో ఐటీ ఉద్యోగి రోహిత్ గౌడ్, ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్‌లో నివాసం ఉంటున్న మణికంఠ మణితేజ, విజయవాడకు చెందిన మడగాని తరుణ్ డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించారు. వారికి డ్రగ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. వారి నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు రూ.1.50 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విజయవాడకు చెందిన అలీమ్ (ఏ1) ఎండీఎంఏ ప్రధాన సరఫరాదారుగా వ్యవహరిస్తున్నట్లు తేలగా, ఖమ్మం వంశీ దిలీప్ (ఏ2), మడగాని బాల ప్రకాశ్ (ఏ3)గా ఉన్నారు. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తూ గ్రాముకు రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి అనంతపురానికి చెందిన కార్తిక్, బెంగళూరులో ఉన్న గుర్తుతెలియని నైజీరియన్ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.