04-01-2026 12:20:05 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు శనివారం శాసనమండలిలో ఆమోదం పొందింది. ఈ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మండలిలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు ముందు బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి యూరియా పంపిణీ, కొరతపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్నీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు.
అయితే దీనికి నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు ఎల్ రమణ, మధుసూదనాచారి, నవీన్‌కుమార్, దాసో జు శ్రవణ్, వాణీదేవి, వంటేరి యాదవరెడ్డి వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. రైతులేనిదే రాజ్యం లేదు అంటూ స్లోగన్స్ ఇచ్చారు. వారి నిరసనల మధ్యనే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదం పొందింది.
దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిల్లుపై తాను మాట్లాడాలని, మాకు అవకాశం ఇవ్వలేదని, చెప్పాలి కదా అంటూ మండలి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై చర్చకు అనుమతించకపోవడంతో సమావేశాలను బహిష్కరిస్తున్నామని మీడియాపాయింట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు విలేకరులతో తెలిపారు.