17-01-2026 03:02:14 AM
జిల్లాకు యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం
పెండింగ్ ప్రాజెక్టులన్నీపూర్తి చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మామడ మండలం పునకల్ సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం
నిర్మల్, జనవరి 16 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పునకల్ సదర్మట్ బ్యారేజీని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి సీఎం ప్రారంభించారు. అనంత రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో 326 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు వరాల జల్లులు ప్రకటించారు.
అదిలాబాద్ ప్రాం తం పోరాటాలకు పురుటి గడ్డ అన్నారు. కుమ్రం భీం, రాంజీ గుండు వంటి గుండు వీరులు జల్ జంగల్ జమీన్ నినాదంతో ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడి అమరులయ్యారని గుర్తు చేశారు. త్వరలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును నిర్మిస్తామని.. అందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తిచేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
బాసరలో త్వరలో ఓ యూనివర్సిటీని ఏర్పా టు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రగతిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. తాను ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి ఆలోచిస్తానని ఆ తర్వాత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నానని సీఎం అన్నారు. ప్రారంభించిన రెండు ప్రాజెక్ట్‌లకు దివంగత కాంగ్రెస్ నేతల పేర్లు పెడుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు సదర్ మట్‌కు మాజీ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు పి నర్సారెడ్డి పేరు, అదిలాబాద్ జిల్లా చనాక కోరట ప్రాజెక్టుకు మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి పేర్లను పెడుతున్నట్టు తెలిపారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారని ఈ పనులు త్వరలో చేపడుతున్నామన్నారు.
కాగా నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి, ఎంపీ జి నాగే ష్, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్, వెడుమ బుజ్జు పటేల్, ఎమ్మెల్సీలు దండ విట్టల్, అంజి అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ ఎమ్మెల్యేలు రేఖా శ్యాం నాయక్, నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.