19-09-2025 12:50:07 AM
-ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు!
-పంచాయతీ సెక్రటరీ సహకారం
-లబ్ధిదారులకు నష్టం
-ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్‌లో ఘటన
ఆదిలాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి)/ఇచ్చోడ: ఓమహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, అదే పేరు గల మరో మహిళ ఇంటి నిర్మాణం చేపట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లే నందబాయి (భర్త సంతోష్) అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. అదే పేరు గల ముస్లే నందబాయి (భర్త మారుతూ) అనే మరో మహిళకు ఇల్లు మంజూరైదంటూ పంచాయతీ సెక్రటరీ సునీల్ నాయక్ చెప్పడంతో వారు ఇంటి నిర్మాణం చేపట్టారు.
ఈ సందర్భంగా అసలు లబ్ధిదారు భర్త సంతోష్ మాట్లాడుతూ.. తన భార్య నందబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయాన్ని పంచాయతీ సెక్రటరీ తమకు తెలుపకుండా అదే పేరు గల మరో మహిళకు ఇంటి నిర్మాణానికి సహకరించాడని ఆరోపించారు. మొదటి దశ ఇంటి నిర్మాణ బిల్లు మంజూరు కాగానే తన భార్య నందబాయిని బ్యాంక్‌కు పంచాయతీ సెక్రటరీ తీసుకెళ్లి.. ఆమె ఖాతాలో పడ్డ లక్ష రూపాయలను ఇంటి నిర్మాణం చేపట్టిన వారి ఖాతాలోకి బదిలీ చేయించాడని తెలిపారు.
దీంతో తాము పంచాయతీ సెక్రెటరీని నిలదీశామని, ఆయన నకిలీ లబ్ధిదారుకు బదిలీ చేసిన రూ.లక్షను ఐదు రోజుల్లో చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడని, ఆ తర్వాత మాట మార్చడని సంతోష్ వెల్లడించారు. అయితే ఇదే విషయమై ఇచ్చోడ ఎంపీడీవోను వివరణ కోరగా... ఒకరి పేరిట మంజూరైన ఇల్లు మరొకరు కట్టుకున్నమాట వాస్తవమని, అయితే ఇద్దరి పేరు ఒకటే కావడంతో తప్పిదం జరిగిందని, ఈ విషయంపై కలెక్టర్ కార్యాయానికి నివేదికను పంపినట్టు తెలిపారు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
లబ్ధిదారుల ఫొటో లేకుండానే..
అసలు లబ్ధిదారు కాకుండా మరొకరు ఇంటి నిర్మాణం చేపట్టడం, మొదటి దశను పూర్తిచేసుకోవడం ఎలా సాధ్యమైందని ఇచ్చోడ ఎంపీడీవో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశకు సంబంధించిన బిల్లులు ఎలా మంజూరు అయ్యాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. బిల్లు మంజూరుకు లబ్ధిదారులు తప్పకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఫొటో దిగాల్సి ఉంటుంది. ఫొటోలు దిగితే తప్పా బిల్లులు మంజూరు కావు. అసలు లబ్ధిదారులు ఫొటో దిగనిదే బిల్లులు ఎలా మంజూరు అయ్యాయనే అనుమానాలపై విచారణ చేపడుతున్నామని వెల్లడించారు.