19-09-2025 12:44:29 AM
మేడ్చల్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): పురపాలక సంఘాలలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమైనది. మాస్టర్ ప్లాన్, పట్టణ ప్రణాళిక, నూతన భవనాల కు అనుమతులు, అక్రమ నిర్మాణాలను అరికట్టడం వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగానికి అధికారులు లేనందున మున్సిపాలిటీలలో పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తంగా తయారైంది. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రెండు, మూడు మునిసిపాలిటీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీకి వారంలో రెండు రోజుల కేటాయిస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు రోజుల కూడా ఆయా మున్సిపాలిటీలకు వెళ్లడం లేదు. అక్రమ నిర్మాణాల విషయమై ప్రజలు ఎన్నిసార్లు విన్నవించిన చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. ఈలోపు అక్రమ నిర్మాణాలు పూర్తవుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ కు పూర్తిస్థాయి అధికారి ఉంటే బాధ్యత ఉంటుంది. ఇన్చార్జి కావడం వల్ల బాధ్యత లేకుండా పోయింది. మేడ్చల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాదు నగరాన్ని ఆనుకొని ఉన్నందున అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. జిల్లాలో అపార్ట్మెంట్ లు, విల్లాలు, గోదాంలు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో చాలావరకు నిబంధనలు పాటించడం లేదు.
జి ప్లస్ టు అనుమతులు తీసుకొని బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. గోదాముల సైతం అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వారానికి రెండు రోజులు వచ్చే టీపిఓలు వీటిని అడ్డుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
వేర్వేరు జిల్లాల్లో ఇన్చార్జి
ఒక జిల్లాలోని ఒక మున్సిపాలిటీ కాకుండా వేర్వేరు జిల్లాల్లో వేరువేరు మున్సిపాలిటీలకు టిపిఓలు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ టి పి ఓ మంజు భార్గవి మేడ్చల్ జిల్లాలోని పోచారం, రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ మున్సిపాలిటీలలో ఇన్చార్జి టిపిఓగా ఉన్నారు. హెచ్‌ఎండిఏ లో పనిచేసే రాజీవ్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఇన్చార్జి టిపిఓగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాకుండా ఉప్పల్ నుంచి భువనగిరి వరకు లేఔట్ అనుమతులు విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో టిపిఓగా పనిచేస్తున్న శ్రీదేవి మేడ్చల్ జిల్లాలోని ద్మగూడ, నాగారం మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా ఉన్నారు.
మేడ్చల్ లో టీపిఓగా పనిచేస్తున్న రాధాకృష్ణారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ తో పాటు, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో ఇన్చార్జి టిపిఓగా పనిచేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీలో టిపిఓగా పనిచేస్తున్న సంజన అదనంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తూముకుంట, అలియాబాద్, మూడు చింతలపల్లి లోనూ ఇదే పరిస్థితి ఉంది.
మేడ్చల్ లో 263 అక్రమ నిర్మాణాలు
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 263 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో చాలా నిర్మాణాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నెలలు గడిచిన చర్యలు తీసుకోలేదు. డిపిఓ వారానికి రెండు రోజులు మాత్రమే మేడ్చల్ లో డ్యూటీ చేస్తారు. అది కూడా వస్తారనే గ్యారెంటీ లేదు. ప్రభుత్వం పట్టణ ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయాలి. రెగ్యులర్ డిపిఓలను నియమించి అక్రమ నిర్మాణాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
- శ్రీహరి చారి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి