calender_icon.png 22 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధాన్ని ముగించే రక్షకుడు

22-08-2025 12:50:12 AM

శుక్రవారం అగ్ర నటుడు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రబృందం అభిమానులకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సోషల్- ఫాంటసీ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ని గురువారం విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఎపిక్ టోన్ సెట్ చేసింది. ఓ బాలుడు, పెద్దాయన మధ్య జరిగే సంభాషణతో గ్లింప్స్ మొదలవుతుంది.

‘విశ్వంభర’లో జరిగిన పరిణామాల గురించి ఆ పెద్దాయన చెబుతాడు. ‘ఒకరి స్వార్థం కారణంగా జరిగిన యుద్ధం.. కొన ఊపిరితో బతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడొకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా గొప్పగా ముగిస్తాడని ఎదురుచూసే రక్షకుడు’ అంటూ సాగుతోందీ గ్లింప్స్. చిరంజీవి మాస్ లుక్‌లో, రక్షకుడిగా ఇచ్చిన పవర్‌ఫుల్ ఎంట్రీ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మౌని రాయ్ ప్రత్యేక పాటలో అలరించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కీరవాణి, భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యం వహిస్తుండగా, చోటా కే నాయుడు డీవోపీగా వ్యవహరిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. ఈ మేరకు చిరంజీవే స్వయంగా ఓ ప్రత్యేక వీడియో ద్వారా రిలీజ్ టైమ్‌ను ప్రకటించారు.