calender_icon.png 16 December, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే స్థానిక పోరు..

13-12-2025 06:45:03 PM

పేటలో 25 పంచాయతీలు 29,837 మంది ఓటర్లు..

220 పోలింగ్ కేంద్రాలు. 660 మంది సిబ్బంది..

తేలనున్న 64 మంది సర్పంచి అభ్యర్థులు, 417 మంది వార్డుసభ్యుల భవితవ్యం..

పంపిణీని పరిశీలించిన అదనపు కలెక్టర్, జనరల్ అబ్జర్వర్..

అశ్వారావుపేట (విజయక్రాంతి): ఎట్టకేలకు తెలంగాణలో 23 నెలల తరువాత గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎందరో అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. వారం రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం చేసి లక్షలకు లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థుల్లో అదృష్టవంతులు ఎవరో తెలియనుంది. జిల్లాలో రెండవ విడతలో జరిగే అశ్వారావుపేటలో మండలంలో పేట మున్సిపాలిటీ మినహాయిస్తే 27 పంచాయతీలు ఉండగా మద్దికొండ, రామన్నగూడెం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 25 పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో మొత్తం 30,699 మంది ఓటర్లు ఉండగా ఏకగ్రీవం అయిన రెండు పంచాయతీలను మినహాయిస్తే 29,840 మంది తమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సర్పంచి బరిలో 64 మంది, 220 వార్డుల్లో 117 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పంచాయతీ పోరుకు సంబందించి శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. 220 పోలింగ్ కేంద్రాల్లో 220 మంది పీవోలు, 440 మంది ఓపీవోలు విధులు నిర్వహిస్తున్నారు. మండల ఎన్నికల అధికారి అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేశారు. మండలాన్ని నాలుగు జోన్లు, 8 రూట్లుగా విభజించారు. సిబ్బందిని 24 బస్సులో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, జనరల్ అబ్జర్వర్ సర్వేస్వర్ రెడ్డి పరిశీలించారు. ఎన్నికల విదులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు.

200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

అశ్వారావుపేట మండలంలో పల్లెపోరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎనిమిది రూట్లలో ప్రత్యేక సిబ్బందితో పాటు నాలుగు మెబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. మండలంలో అనంతారం గాండ్లగూడెం, అసుపాక సమస్యాత్మక గ్రామాలు కాగా కన్నాయిగూడెం, కావడిగుండ్ల ప్రాంతాలను మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ పంచాయతీల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు యయాతిరాజు, అఖిల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.