calender_icon.png 17 July, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం గుట్టు విప్పుతా

12-06-2025 01:34:16 AM

రెండు రోజుల్లో ప్రెస్‌మీట్ పెడతా

  1. ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ బయటపెడతా
  2. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు పెద్ద శత్రువులు
  3. వాళ్లకు కాంగ్రెస్‌లోకి నో ఎంట్రీ
  4. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడుతున్నది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే
  5. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు రోజుల్లో హైదరాబాద్‌లోనే మీడియా సమావేశం నిర్వహిస్తానని, ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయటపెడతానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా అక్కడ మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు పెద్ద శత్రువులని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

వారి కుటుంబానికి కాంగ్రెస్‌లోకి నో ఎంట్రీ అని తేల్చిచెప్పారు. మంత్రుల శాఖలపై కసరత్తుకు తాము ఢిల్లీ రాలేదని, తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వే మాడల్‌ను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించేందుకే వచ్చినట్టు తెలిపారు. రాహుల్ గాంధీ, ఖర్గే కూడా సమావేశంలో ఉన్నారని పేర్కొ న్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు రాకుం డా అడ్డుపడుతున్నది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే అని ముఖ్యమంత్రి ఆరోపించారు.

రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రేర్ కాంబినేషన్ అని అన్నారు. 18 నెలలుగా కేసీ ఆర్ కుటుంబంపై ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42  శాతం రిజర్వేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపకుంటే, పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

ఆరు నెలల తర్వాతనే కేటీఆర్‌కు మంత్రి పదవి..

కేసీఆర్ కూడా ఆరునెలల పాటు ఆయన కుమారుడైన కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదని, ఆయన ఒక్కడే పదవిని అనుభవించాడని సీఎం అన్నారు. కానీ తాను తనతోపాటు 12 మందికి కేబినెట్‌లో అవకాశం కలిపించానని గుర్తు చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి అవకాశం కల్పించామని చెప్పారు.

కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా చెప్పారని, ఇప్పటివరకు దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చర్చ ఎప్పుడు వారి చుట్టే జరగాలని కేసీఆర్ కుటుంబం ప్రయత్నాలు చేస్తుంటుందని విమర్శించారు. ఇప్పుడు అందరు కలిసి కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌తో పాటు వచ్చారని ఎద్దేవా చేశారు.

మార్పులు, చేర్పులపై హైదరాబాద్‌లోనే

మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని స్పష్టం చేశారు. 55% మేరకు ఇప్పటికే పదవులు కేటాయించామని తెలిపారు. మిగతా మంత్రులకు పనిభారం ఉందంటే వారికి శాఖలు తగ్గిస్తానని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాతే ఏమైనా మార్పులు చేర్పుల గురించి చర్చిస్తానని వెల్లడించారు.

నక్సలిజానికి అంతముండదని, సామాజిక సమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో వారికి పదవులు లభిస్తాయని, తన కుటుంబంలో ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టే ఎలాంటి పదవులు లేవని స్పష్టం చేశారు.

రాష్ట్రాకేమీ రాకుండా కిషన్‌రెడ్డే అడ్డు

కేంద్రం నుంచి రాష్ట్రానికేమీ రాకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ముందుకు వస్తే కిషన్‌రెడ్డితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్‌రెడ్డితో సమీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులపై కిషన్‌రెడ్డి నివేదిక ఇచ్చారా?, కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా ప్రస్తావించారా అన్నారు.

నిర్మలా సీతారామన్ చెన్నైకి మెట్రో తీసుకెళ్లారని, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని, కానీ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి మాత్రం రాష్ట్రానికి ఏం తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కిషన్‌రెడ్డి అడ్డుగా ఉన్నారని తెలిపారు.