13-07-2025 07:14:20 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): అత్యాశ, అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే(District SP Kiran Khare) అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు స్వీయ అప్రమత్తత, అవగాహన కలిగి ఉండటం అవసరమని ఎస్పీ తెలిపారు. ప్రజలు డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడవద్దని, నిర్భయంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే యువత బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేసి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ పీఎం కిసాన్, ఎస్బిఐ బ్యాంకు రివార్డ్ అనే ఏపీకే ఫైల్స్ వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారని, పొరపాటున ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారంటే మీ ఫోన్ హ్యాక్ అయి వినియోగదారుడి ఫోన్ లో గల ఓటిపిలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత వివరాలు చోరికి గురై సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళతాయన్నారు. అనుమానస్పద లింక్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు లేదా ఓటిపిలు ఎవరితోనూ షేర్ చేయకుండా ఉండాలని తెలిపారు. ఈలాంటి సమాచారం ప్రభుత్వ సంస్థలు అడగవని, ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.