calender_icon.png 2 September, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృ ద్ధిలో రాష్ట్రం ఆదర్శం

02-09-2025 12:29:13 AM

  1. ఎస్‌హెచ్‌జీలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు
  2. సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  3. హాజరైన మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో మహిళ లకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలవారు వచ్చి చూసే పరిస్థితిని తీసుకొస్తున్నామని తెలిపారు.

రాష్ర్టంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ర్టంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తామని, ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తోందని పేర్కొన్నారు. మహిళలను పారి శ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి, ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో మహిళలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఐదేండ్లలో రాష్ర్టంలో కోటి మం ది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణా లు అందజేస్తున్నామని చెప్పారు. ఏటా రూ. 20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి మొదటి సంవత్సరంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 21,600 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.

హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని రాష్ర్ట ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదిగేందుఉ ప్రోత్సహిస్తోందని తెలిపారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్ల ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పాన్ని గుర్తుచేశారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత రవాణా, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్త్, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.

పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఆర్టీసీ అద్దె బస్సులు వంటి వ్యాపారాల్లో మహిళా సం ఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల కుపైగా రుణాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇల్లు కట్టుకొనే స్థితిలో లేని పేదలకు మహిళా సం ఘాల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. మహిళా సంఘ స భ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. 

మత్స్య రంగంలో అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణను మత్స్య రంగంలో అగ్రగామిగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 46,000 చెరువులలో చేపల ఉత్పత్తిని చేపట్టడం ద్వారా గ్రామీణ వర్గాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు లభిస్తాయని, రాబోయే రోజుల్లో రాష్ర్టం చేపల ఎగుమతుల్లో ముందంజలో ఉంటుందని తెలిపారు.

చేపల ఉత్పత్తిని పెంచడానికి, ఆ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రీకృత ప్రణాళికతో ప్రభుత్వం ఈ ఏడాది మత్స్యశాఖకు రూ.122 కోట్లు మంజూరు చేసిందని తెలియజేశారు. సెర్ప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.