14-10-2025 05:39:33 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో మంగళవారం ఇద్దరు బీజేపీ అగ్ర నాయకులు నోరు పారేసుకున్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బీజేపీ వర్గాలను నివ్వెర పరిచింది. ఇటీవల కాంగ్రెస్ నాయకుల తప్పుడు కేసు వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నాయకుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబాన్ని పరామర్శిస్తున్న క్రమంలో పెద్దపల్లి బీజేపీ పార్లమెంటు ఇన్చార్జి గోమాస శ్రీనివాస్ అక్కడే ఉన్న పెద్దపెల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేతను అరేయ్ వెంకటేష్ అని సంబోధించారు.
దీంతో కింద కూర్చుని ఉన్న వెంకటేష్ నేత అరేయ్ అంటే చెంప పగలగొడతా అంటూ అందరి ఎదుటే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో గోమాస శ్రీనివాస్ వెంకటేష్ నేతను బట్టలూడదీసి కొడతా అంటూ మీదికి వెళ్ళబోయాడు. దీంతో కింద కూర్చొని ఉన్న మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత గోమాస శ్రీనివాసును కొట్టేందుకు ముందుకెళ్లారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకొని వెంకటేష్ నేతను ఆపడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల ముందే ఇద్దరు అగ్ర నేతలు తిట్ల పురాణానికి తెరలేపడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.