calender_icon.png 17 August, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లులో పొంగుతున్న వాగులు

17-08-2025 12:25:50 AM

నీట మునిగిన పొలాలు 

మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవా రం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా 9 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది. కురవిలో 8, కొత్తగూడలో 6.3, బయ్యారంలో 7.2, గంగారంలో 6.4, చిన్న గూడూరులో 4.9, గార్లలో 4.9, కేసముద్రంలో 3.8, డోర్నకల్‌లో 3.8, మహబూ బాబాద్‌లో 3.2, మరిపెడలో 2.4, నెల్లికుదురులో 2.1 సెం.మీ.ల వర్షపాతం నమోద యింది. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఏజెన్సీ ప్రాంతం కొత్తగూడ, నర్సంపేట మార్గంలో రహదారులపై పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. గూడూరు సమీపంలో పాకాల వాగు హైలెవెల్ వంతెన పైనుంచి పొంగి ప్రవహించ డంతో నెక్కొండ, కేసముద్రం ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. భూపాలపల్లి జిల్లా మహా ముత్తారంలో 10.5సెం.మీ., భూపాలపల్లిలో 9.7, పలిమెలలో 9.1, మలర్‌రావులో 5.5, రేగొండలో 5.2, ఘన్‌పూర్ లో 6.2, కాటారంలో 3.6, మహాదేవపూర్‌లో 3.6, టేకుమట్లలో 2.9, మొగుళ్లపల్లిలో 2.9 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది.

జలదిగ్బంధంలో మద్దివంచ, రాంపూర్

గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల వద్ద పాకాల వాగు నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల మండలం మద్దివంచ, రాంపూర్ గ్రామాలతో పాటు పలు శివారు గిరిజన తండాలకు చెందిన ప్రజలకు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. లో లెవెల్ కాజ్ వే పైనుం చి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తుండడటంతో గార్ల నుంచి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో ఆయా గ్రామాల ప్రజలు అత్యవసరమైతే రైల్వే వంతెన పైనుం చి కాలినడకన రావడం, లేదంటే మూడు కిలోమీటర్ల దూరం ఉండే గార్లకు 30 కిలోమీటర్లు బయ్యారం మీదుగా ప్రయాణించి గార్లకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

హైవే.. మా పంటల్ని నీట ముంచింది 

గ్రీన్ ఫీల్డ్ హైవే తమ పంట పొలాలను నీట ముంచిందని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన వరద నీరు చేరి పలువురు రైతులకు చెందిన వరి పంట నీట మునిగింది.

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సమయంలో వరద నీరు దిగువకు వెళ్లే విధంగా కల్వర్టు నిర్మించకుండా మొత్తం బ్లాక్ చేసి రోడ్డు వేస్తున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్‌కు వివరించినా సమస్య తమ పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.