28-09-2025 12:30:50 AM
జీవితంలో చిన్న చిన్న వస్తువులతో మనకు ఎనలేని అనుబంధం ఉంటుంది. మనకు అలా మనసు తడిసే జ్ఞాపకం రాతిపలక బలపం. దీన్ని గుర్తుచేసుకుంటే విద్యార్థి దశ జ్ఞాపకాలు కళ్లముందు సజీవమవుతాయి. అది ఒక రాయి కాదు, మన బాల్యం చదువులకు, మన కలలకు, మన ఆటలకు మన ప్రాణ స్నేహం రాతిపలకే. నేడు మనమంతా పెన్, పుస్తకం, టాబ్లెట్, మొబైల్‌తో వాడుతున్నప్పటికీ, బాల్యంలో వాడిన రాతిపలక ఆత్మీయత లభించదు.
రోజురోజుకు పెచ్చురిల్లుతున్న సాంకేతికత పోకడల్లో ఆ చిననాటి రాతి పలక బలపం కనుమరుగయ్యాయి. ప్రస్తుత గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఆ జ్ఞాపకాలను మళ్లీ ఆవిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేదంటే సాంకేతికత లోకంలో జ్ఞానం పెరిగినా, జ్ఞానం ఇచ్చే విలువలు మాయమైపోతాయి.
పలక బలపం మన విద్యార్థి జీవితానికి అద్దంలా నిలిచింది. కొన్ని తరాల బాల్యం రాతిపలకతో ముడిపడి ఉంది. గులకరాయి గీసిన శబ్దం తరగతి గదులను నింపిన రోజులు నిన్నటివే అనిపిస్తున్నాయి. పలక బలపం కడిగి ఆరబెట్టి, సంచిలో పెట్టుకొని పాఠశాలకు బయలుదేరిన అప్పటి క్రమశిక్షణ దృశ్యాలు మన జ్ఞాపకాల్లో శాశ్వత ముద్ర వేశాయి. ఎన్నో వచ్చిరాని గీతలు, బొమ్మలు, ఆటలు. వేసుకున్న అంగీతో తుడుచుకొని శుభ్రం చేసుకొని ఎంతో ప్రేమగా సంకలో దాచుకొన్న రోజులు వర్ణనాతీతం.
పలక బలపం ఒక తరం భావోద్వేగాన్ని మోసిన నిశ్శబ్ద గ్రంథంలా నిలిచింది. ఆ రోజుల్లో పుస్తకాలు తక్కువ, కాగితమూ ఖరీదైనదు. దీంతో రాతి పలక బలపం మనకు జ్ఞాన ద్వారమైంది. ఆ రోజుల్లో పాఠశాల అంటే మొదట గుర్తుకొచ్చేది రాతిపలక. కొత్త పలక బలపం కొన్నపుడు దానిపై మొదటి అక్షరాలు రాసే ఉత్సాహం జ్ఞాపకం వస్తే ఇప్పటికీ మనసు పులకరించిపోతుంది.
కొత్త పలక కోసం తల్లిదండ్రుల దగ్గర అడిగిన ఆనందం, దాన్ని దుకాణం నుంచి తెచ్చిన సంతోషం, రాసే మొదటి గీత ఇవన్నీ స్వర్గానుభూతి. ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లేముందు పలక, బలపాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అది ఒక రకంగా అలవాటుగా మారింది.
‘ఏవైనా తప్పులు రాస్తే చెరిపేసి మళ్లీ రాయాలి’ అనే అలవాటు, ఓర్పు పాఠం పలకనే నేర్పింది. పొరపాట్ల నుంచి నేర్చుకోవడమనే అలవాటు కలిగించింది. ప్రతిరోజు పలక కడుక్కోవడం ద్వారా శుభ్రత క్రమశిక్షణ అలవడుతుంది. అందులో రాసిన అక్షరాలు, గురువు దిద్దుబాట్లు, ఒకే పలకపై పదేపదే రాయడం వల్ల వస్తువు విలువ తెలిసింది.
మధుర స్మృతులెన్నో..
పక్కన స్నేహితుల పలకపై ఒకరికొకరం మార్చుకొని రాసిన రాతలన్ని ఆ రోజుల్లో మన విద్యా పండుగలే. పలకలను కేవలం రాయడానికి చదవడానికే కాక, ఆ పలకతో ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. పాఠశాలకు చేరుకున్న వెంటనే స్నేహితులు పలకలు చూపించుకొని ఎవరి బలపం కొత్తగా ఉందో, ఎవరి అక్షరాలు బాగున్నాయో అని ఆటలాగా మొదలయ్యేది. గురువు తరగతిలోకి వచ్చిన వెంటనే ‘అ, ఆ, ఇ, ఈ’ అంటూ మేమందరం ఒకే స్వరంలో పలకలపై రాయడం మొదలు పెడుతాం.
పలకపై గులకరాయి గీసే శబ్దం తరగతి అంతా నింపేసేది. ఆ శబ్దమే మాకు మధురమైన సంగీతం. కొన్నిసార్లు ఒకరి పలకపై ఒకరం పేర్లు రాసుకొని ఆటపట్టించుకోవడం.‘ఎవరి అక్షరం బాగుందో చూద్దాం’ అంటూ పోటీ పడటం. పగిలిపోయిన పలక ముక్కలను కత్తికర్రలా వాడుకోవడం కూడా మా ఆటలలో భాగమే. ఆ పలక కేవలం చదువుకు మాత్రమే కాదు, మా స్నేహాలకు కూడా ఆధారం.
ఆ రోజుల్లో ఒక పలక బలపం పాఠశాల ఆరంభం నుంచి ఐదో తరగతి వరకు అన్ని విషయాలు రాసుకుంటూ, చేరిపివేస్తూ ఎన్నో నోట్ పుస్తకాలకు బదులుగా వాడుకున్నాం. ఈ రోజుల్లో బడికి వెళ్లాలంటే సంచి నిండా పుస్తకాలే. నేడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ పరికరాల మధ్య పలక బలపం పేరు చెప్పినా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. పుస్తకాల, పెన్నులు ల్యాప్‌టాప్‌ల లోకంలో ఆ చిన్న పలక అడ్రస్ గళ్లంతైంది. పిల్లలకు పలక చూపిస్తే ‘ఇది ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు.
ఎన్నో తరాలకు జీవన శిల్పి..
ఒకప్పుడు పాఠశాలల హృదయమైన పలక, బలపం, ఇప్పుడు మ్యూజియాల్లో కనిపించే పరిస్థితి తలెత్తింది. బలపం లేని చదువు ఖరీదైన పుస్తకాల బరువుతో, గాడ్జె ట్ల వ్యసనంతో నిండిపోయింది. ఒక పలక బలపం ఉంటే అన్ని నోటు పుస్తకాలు ఉన్నట్లే ఉండేది. ఈ రోజుల్లో సంచి నిండా పుస్తకాలు ఉన్నా ఏదో ఒకటి తక్కువగానే ఉన్నట్టుంది. పలకపై రాసిన మొదటి ‘అ, ఆ, ఇ” అక్షరా లు.. చెమటతో తడిసిన చేతుల ముద్రలు..
తరగతి మధ్య లో గురువు గంభీర స్వరం, నేడు జ్ఞాపకాల తలుపులా నిలిచాయి. రాతి పలక బలపం ఇప్పుడు ఒక పాత జ్ఞాప కం. అయినా, అది ఎన్నో తరాలకు జీవన శిల్పి. ఓర్పు, క్రమశిక్షణ, సరళత, పక్కవారికి సహాయం ఈ విలువల న్నీ పలక బలపం నుంచి నేర్చుకున్నవే. ఇప్పుడు పిల్లలకు అది తెలియకపోయినా, నా వంటి పలకలతో పెరిగినవారికి అది ఎప్పటికీ బాల్యపు బంగారు జ్ఞాపకమే.
ఓ తరం సంస్కృతికి శిలాశాసనం..
పలక బలపం ఒక చిన్న రాయి కాదు, ఒక తరం సంస్కృతికి శిలాశాసనం. సరళత, మితవాదం, ఓర్పు, కష్టపడి నేర్చుకోవడం అనే విలువలు బలపం ద్వారా పెరిగాయి. నేటి విద్యా వ్యవస్థలో అవే విలువలు కోల్పోతున్నాయి. అందుకే ఈ జ్ఞాపకాలను నేట తరానికీ గుర్తుచేయడం సమాజపు బాధ్యత. పలకపై బలపంతో గీసిన చిన్నచిన్న గీతల మధ్యలోనే మహా కలల విత్తనాలు నాటబడ్డాయి. పెరిగి పెరిగి ఎన్నో జీవితాలకు దీపమయ్యాయి.
కాలగమనంలో రాతి పలక బలం కరిగి పోయింది. రాతిపలక వైభవం గతమైపోయినా, దాని పాఠాలు భవిష్యత్తుకూ అవసరమే. విద్యలో సరళతను, విలువలను తిరిగి తీసుకు రావాలంటే మనం పలక బలపం జ్ఞాపకాలను మళ్లీ ఆవిష్కరించుకోవాలి. లేదంటే సాంకేతిక లోకంలో జ్ఞానం పెరిగినా, జ్ఞానం ఇచ్చే విలువలు మాయమైపోతాయి.
- దుప్పటి మొగిలి