14-12-2025 12:07:58 AM
సంగారెడ్డి, డిసెంబర్ 13(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సన్మానించారు. శనివారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో 45 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి తాను రాకున్నా గెలిచిరావాలని చెప్పానని, అదే విధంగా పార్టీ బలం, మీ శక్తియుక్తులతో గెలిచారని తెలిపారు. కండువా వేసుకుని గెలిచిన వారు నా సర్పంచ్ లు.. కండువా వేసుకుని ఓడిపోయిన వారు కూడా నాకు సర్పంచులేనని తెలిపారు.
అయితే గెలిచిన వారికి నిర్మల సన్మానం చేస్తే ఓడిన వారికి నేను సన్మానం చేశానని, ఎందుకంటే నేను కూడా ఓడిపోయిన వాడినేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ గా నిలబడి గెలిచిన వారికి ఈ సమావేశంలో అనుమతి ఇవ్వలేదన్నారు. ఇండిపెండెంటుగా గెలిచిన వారు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే బ్లాక్ , మండల కాంగ్రెస్ నాయకులు నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా కొండాపూర్ స ర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయిన మస్కు అలవేణి నర్సింహ్మరెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రె స్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.