10-08-2024 01:25:00 AM
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ‘పాలమూరు ఎత్తిపోతల’ పనులు సత్వరం పూర్తి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో జలాలన్నీ సముద్రం పాలవుతున్నాయని ధ్వజమెత్తారు. మొన్నటివరకు మేడిగడ్డ బరాజ్ నాణ్యతపై కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారని, ఇప్పుడు ఆ బరాజ్ నుంచే జలాలు పారుతున్నాయని, అందుకు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఎత్తిపోతల పథకం పరిధిలోని ఒక పంప్ ప్రారంభమైందని గుర్తుచేశారు. నార్లాపూర్, ఎదుల, వట్టెంలో చొప్పన పంపులు సిద్ధంగా ఉన్నాయరన్నారు. కేసీఆర్ కృషితో వీటి ద్వారా దాదాపు 30 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ప్రచారం చేశారన్నారు.
కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేపడితే, కాంగ్రెస్ పార్టీ కేసులు వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్‌ను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో అందుబా టులోకి వచ్చిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను ప్రస్తుత ప్రభుత్వం వినియోగిం చుకోలేపోతుందని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి రాష్ట్రప్రభుత్వం స్పందించాలని, వట్టెం వరకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ స్పందించాలి బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నాటి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మించారని, అయినప్పటికీ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన పథకాలను సందర్శించలేదని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వెంటనే సీఎం స్పందించి ప్రాజెక్ట్ పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ అసమర్థతతో రోజుకు 30 టీఎంసీలకు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, దీంతో తెలంగాణ రిజర్వాయర్లు వెలవెలబోతు న్నాయన్నారు. కానీ ఆంధ్రా రిజర్వాయర్లు మాత్రం కళకళ లాడుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.