calender_icon.png 14 May, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మచెరువుకట్టను వెడల్పు చేయాలి

14-05-2025 12:01:40 AM

మున్సిపల్ ఆఫీసు ముందు బీజేపీ కార్యకర్తల ధర్నా

హుస్నాబాద్, మే 13 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజల జీవనాడి, సాంస్కృతిక ప్రతీకగా గుర్తింపు పొందిన ఎల్లమ్మ చెరువు కట్ట విస్తరణ కోసం బీజేపీ పోరాటానికి సిద్ధమైందనీ, పట్టణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిధ్వనిస్తూ, కట్టను తక్షణమే విస్తరించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసు ముందు  పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

ఈసందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మచెరువు సుందరీకరణ పనుల పేరుతో ప్రజల సౌకర్యాలను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎల్లమ్మ చెరువు కట్ట కేవలం ఒక నీటి వనరు కాదని, అది హుస్నాబాద్ ప్రజల గుండె చప్పుడన్నారు.

ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు అక్కడ బతుకమ్మ పండుగను అత్యంత వైభ వంగా జరుపుకుంటారని,సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న వాటర్ ఫౌంటైన్లు, పైలాన్లు, పిల్లర్లతో కట్ట స్థలం కుంచించుకుపోతోందని, ఇది ప్రజల సౌకర్యాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. కట్టపైన తెలంగాణ తల్లి విగ్రహం నుంచి చివరి వరకు కట్టను విస్తరిస్తే, మహిళలు యథావిధిగా బతుకమ్మ ఆడుకోవడానికి విశాలమైన స్థలం లభిస్తుందన్నారు. వాకింగ్, జా గింగ్ చేసేవారికి కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు.

ప్రజల డిమాండ్ను పట్టించుకోకపోతే, తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ఆందోళనలో పార్టీ నాయకులు పోలోజు రవీందర్, వరయోగుల అనంతస్వామి, బోడిగె వెంకటేశ్, పట్టణ ఉపాధ్యక్షుడు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారి అక్కోజు అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారీ, మండల కార్యదర్శి బానోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు.