10-01-2026 08:59:46 PM
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలి పోయే ప్రజలతో పాటు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజల ఇండ్లల్లో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై సిసిఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తూ సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు.
అదేవిధంగా ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ కాని డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలని, బీరువా తాళాలు ఇంటిలో బెడ్ క్రిందకాని, బట్టల క్రిందకాని పెట్టకుండా, వెంట తీసుకెళ్ళాలని, తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలని, నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డ్ గా నియమించుకోవాలని, ఇంట్లో స్వీయ రక్షణకై 15 రోజుల స్టోరేజ్ కలిగి వున్న రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో ఇంటిని, పరిసరాలను ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు అన్నారు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు.
ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలనీ, ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలనీ,సోషల్ మీడియాలో లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే అప్డేట్స్ పెట్టకండినీ,ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలనీ,గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయాలని,ఇంట్లో పనిచేసే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించుకోవాలని తదితర సూచనలు చేశారు.