19-06-2025 01:49:05 AM
మినిట్స్‌లో అనుమతులకు సంబంధించిన ప్రస్తావనే లేదు..
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కాళేశ్వ రం ప్రాజెక్టు అంశం ఎప్పుడూ క్యాబినెట్ ముందుకురాలేదని, బీఆర్‌ఎస్ హయాంలో 96 క్యాబినెట్ సమావేశాలు జరిగితే ఒక్కదానిలోనూ కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినట్లు లేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కావాలంటే వీటికి సంబంధించిన క్యాబినెట్ మినిట్స్ రికార్డులను చెక్ చేసుకోవచ్చన్నారు. ఈనెల 30 లోపు కాళేశ్వరం కమిషన్‌కు క్యాబినెట్ మినిట్స్‌ను అందజేస్తామని సీఎం తెలిపారు.
2016లోనే బనకచర్లకు బీజం పడిందని, తెలంగాణకు నష్టం చేసింది, ఈపాపానికి పునాది వేసిందే కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 అక్టోబర్‌లో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని తెలిపారు. 21--9--2016న ఢిల్లీ శ్రమశక్తి భవన్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీరు మంత్రి హరీశ్‌రావు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారని వివరించారు.
గోదావరి విషయంలో 2016లో కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకు తోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోందన్నారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదని, 300 టీఎంసీల ప్రాజెక్టు అన్నారు. ఈపాపానికి కారకుడు మీ మామనే అని హరీశ్‌రావును ఉద్దేశించి విమర్శించారు. అఖిలపక్ష భేటీకి రాకుండా కిషన్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో ఆంతర్యం ఏంటని, మేం వెళ్లి కలుస్తామని తెలిసి బుధవారమే వెళ్లి కలవడం వెనక ఏం కుట్ర దాగుందన్నారు.
బుధవారం గోదావరి అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారని తెలిపారు. ఆ సమావేశంలో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారని, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడిందన్నారు.
ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు.. కోల్పోయా క ఎలా మాట్లాడుతున్నారో వివరించదలుచుకున్నట్లు తెలిపారు. ఈమేరకు గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను మీడియా ముందుంచారు.
మళ్లీ సెంటిమెంట్ రుద్దుతున్నారు..
వాళ్లు సెంటిమెంట్‌తో మళ్లీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి సీఎం ఎద్దేవా చేశారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందు కు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామన్నారు. కేసీఆర్, హరీశ్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తామని, కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అవసరమైతే ఆ మీటింగ్ మినిట్స్ హరీశ్‌రావుకు పంపిసామ్తని వివరించారు.
జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశాం..
రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కేసీఆర్ మాట్లాడారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. నాడు కేసీఆర్, చంద్రబా బు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ముందుకువెళుతోందన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ ఆనాడు మాట్లాడారన్నారు.
ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారన్నారు. తాము వాదనల కు వెళ్లదలచుకోలేదని, అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశామన్నారు. తమ ప్రభుత్వం ఎక్క డా నిర్లక్ష్యం వహించలేదని, ఉన్నఫలంగా హరీశ్ బకెట్లో బురద తీసుకుని తమపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కారకుడే కేసీఆర్...
ఈ పాపానికి కారకుడు మీ మామనే అని హరీశ్‌రావుపై సీఎం మండిపడ్డారు. పాపాల భైరవులు మీరని, కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశార ని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూ రు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును బీఆర్‌ఎస్ వాళ్లు పూర్తిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందేదని, కమీషన్ల కక్కుర్తితో లక్షకోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందివ్వలేదని విమ ర్శించారు. తాము కష్టపడి ఎస్‌ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించా రు. ‘హరీశ్‌రావు హుందాగా వ్యవహరించాలి.. అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దు.. ప్రాజెక్టుల విషయంలో ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు?’ అని సీఎం ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని కలవొద్దా?
సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? అని బీఆర్‌ఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి మేం మీ ఫామ్ హౌస్‌కే వస్తాం.. 50 వేల కోట్లు ఇవ్వండి..ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తామన్నారు. అబద్ధాలతో బతుకు సాగదీయొద్దు..రాష్ర్ట ప్రయోజనాలే మాకు ముఖ్యం.. ఈ విషయంలో మాకు ఎలాంటి శష-భిషలు లేవు.. సామ, దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నాం.. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తాం.. అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.’ అని స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడు భ్రమలో ఉన్నట్లే!
చంద్రబాబు నాయుడికి సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే అది మీ భ్రమే అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘మోదీకి చంద్రబాబు అవసరం ఉంది.. చంద్రబాబుకి గోదావరి జలాల అవసరం ఉంది.. ఈ విషయంలో చంద్రబాబు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు.. మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావు.. తెలంగాణ రాష్ర్ట ప్రయోజనాలు కాపాడుకు నేందుకు మా ప్రణాళిక మాకుంది..
చంద్రబాబునాయుడు.. కేసీఆర్ చెప్పారని కాదు.. గోదావరి బేసిన్‌లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండి’ అని సీఎం హితవు పలికారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లపై తెలంగాణ ప్రాజెక్టులకు మీరు ఎన్‌వోసీ ఇవ్వండి మిగిలిన నీరును మీరు ఎలాగైనా వాడుకోండన్నారు.
పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయని, ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిరావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.