02-12-2025 02:16:33 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 1 (విజయ క్రాంతి): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు జక్రాన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం మోపాల్ మండలం కులాస్ పూర్, జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీల ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు.
నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.